దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు పాక్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు అడ్డంకి కాబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారంగానే పర్యటన యధాతథంగా కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పర్యటన సన్నాహకాలలో భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు టీమ్ ఇండియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పాక్‌లో అత్యవసర పరిస్థితి నెలకొన్న కారణంగా ఇరు దేశాల మధ్య నవంబర్ ఐదు నుంచి భారత్‌లో ప్రారంభం కానున్న సిరీస్ రద్దు కావచ్చునన్న వార్తలు సర్వత్రా వ్యాపించాయి. పాక్‌లోని సైనిక పాలకులు క్రికెట్ జట్టును వెనక్కు రప్పించే దిశగా ఆదేశాలను జారీ చేయవచ్చుననే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో పీసీబీ ప్రకటన క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.