న్యూజిలాండ్ జట్టుతో వారి సొంత గడ్డపై జరిగే మూడో టెస్టులో గెలుపు సాధించి తీరుతామని 'టీమ్ ఇండియా' కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా తమ ఆటగాళ్లు రాణిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పిచ్ సీమర్లకు అనుకూలించడమే కాకుండా, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం భారత పేసర్లకు అనుకూలించే అంశమని ఆయన చెప్పుకొచ్చాడు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కివీస్-భారత్‌ల మధ్య శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు జరుగనుంది. ఇప్పటికే 1-0తో సిరీస్ ఆధిక్యాన్ని కూడబెట్టుకున్న భారత్.. చివరి టెస్టులోనూ గెలిచి కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. అయితే, టెస్టు జరిగే వెల్లింగ్టన్లో ఉండే వాతావరణమే భారత్ ఆటగాళ్లను భయపెడుతోంది.
విపరీతమైన చలిగా ఉండటం ధోనీ సేను పెను సవాల్‌గా మారింది. దీనిపై కిర్‌స్టెన్ మాట్లాడుతూ.. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఆటగాళ్ల ప్రదర్శనే కీలకం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించేందుకు తమ కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఇదే నిరూపించారని కిర్‌స్టెన్ చెప్పాడు.