భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ సోమవారం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వెల్లింగ్టన్లో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో ద్రావిడ్ ఈ అరుదైన రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా పేరుగడించాడు. 134వ టెస్టు ఆడుతున్న ద్రావిడ్ 182 క్యాచ్‌లు పట్టి, రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు మార్క్ వా పేరుమీద ఉండేది. మార్క్ వా 128 టెస్టుల్లో 181 క్యాచ్‌ల పట్టాడు.
కాగా, జహీర్ ఖాన్ బౌలింగ్‌లో మెకింతోష్ బ్యాట్‌ను తాకిన బంతి రెండో స్లిప్‌లో ఉన్న ద్రావిడ్ చేతిలో పడింది. ఈ బంతిని క్యాచ్‌గా ఒడిసి పట్టుకున్న ద్రావిడ్.. అనంతరం ఆ బంతిని ముద్దాడి, తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు. 36 సంవత్సరాల ద్రావిడ్ 1996లో లార్డ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు.
ద్రావిడ్ 52.53 సగటుతో 26 సెంచరీలు, 57 అర్థ సెంచరీలతో 10,823 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ (182) తర్వాత మార్క్ వా (181), స్టీఫెన్ ప్లెమింగ్ (171), బ్రియాన్ లారా (164), మార్క్ టేలర్ (157), అలెన్ బోర్డర్ (156), రికీ పాంటింగ్ (148), జాక్వెస్ కలిస్ (147), మహేళ జయవర్ధనే (142)లు ఉన్నారు.