లంక బ్యాట్స్‌మెన్ల "వరల్డ్ రికార్డు‌" భాగస్వామ్యం

కరాచీలోని జాతీయ స్టేడియంలో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో.. లంక బ్యాట్స్‌మెన్‌లు మహేళ జయవర్థనే(240), థిలాన్ సమరవీర(231)లు పాక్ బౌలింగ్‌పై కదం తొక్కారు. రెండో రోజు ఆటలో వీరిద్దరూ, నాలుగో వికెట్‌కు 428 పరుగులు ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

దీంతో తొలిటెస్టులో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 644 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. ఓపెనర్ ఖుర్రమ్ మంజూర్ 18, కెప్టెన్ యూనిస్ ఖాన్ 0 పరుగులతో ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. మరో ఓపెనర్‌ సల్మాన్‌ భట్‌(23)ను మురళీధరన్‌ పెవిలియన్‌ పంపాడు.

అంతకుముందు 406/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక కొద్దిగా నిదానంగా ఆడుతూ.. స్కోరు బోర్డును మెల్లిగా పరుగులు పెట్టించింది. లంచ్ తరువాత జయవర్థనే టెస్టుల్లో తన ఐదవ డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. లంక వెలుపల మహేళకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. కాసేపటికే సమరవీర కూడా 200 పరుగులు సాధించి, తన కెరీర్‌లో తొలి ద్విశతకం సాధించాడు.

ఇదిలా ఉంటే... 437 పరుగులు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మహేళ-సమరవీరలు 52 సంవత్సరాల ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టారు. 1957లో ఇంగ్లండ్ ఆటగాళ్లు పీటర్ మే, కొలిన్ కౌడ్రేలు నాలుగో వికెట్‌కు వెస్టిండీస్‌పై సాధించిన 411 పరుగుల భాగస్వామ్యాన్ని లంక బ్యాట్స్‌మెన్‌ల జంట కనుమరుగు చేశారు.

వెబ్దునియా పై చదవండి