వెల్లింగ్టన్ టెస్టు: డ్రాపై కివీస్ కోచ్ మోల్స్ ఆశలు

స్వదేశంలో పటిష్టమైన భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో విజయం మాట అటుంచి, కనీసం డ్రాతోనైనా బయటపడాలని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ ఆండీ మోల్స్ కోరుకుంటున్నాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వు స్టేడియంలో భారత్-కివీస్ జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతున్న విషయం తెల్సిందే. భారత్ ఉంచిన భారీ లక్ష్యాన్ని చేరుకునేందుకు కివీస్ ఆటగాళ్ళు ఆపసోపాలు పడుతున్నారు.

దీనిపై కోచ్ మోల్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి గట్టెక్కడం అసాధ్యమని చరిత్ర చెపుతోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ జట్లు విజయం సాధించిన దాఖలాలు లేవు. నేను కోచ్‌గా వచ్చినపుడు తమ జట్టు ఆటగాళ్ళకు ఓ విషయం చెప్పాను. తగిన సమయం గుర్తించి టెస్టును డ్రా ఎలా చేయాలో నేర్చుకోవాలని. ఆ సమయం ఇపుడు ఆసన్నమైంది.

చివరి టెస్టును రక్షించుకునేందుకు కుర్రాళ్లు పోరాట పటిమ ప్రదర్శించాలని పిలుపునిచ్చాడు. వారికిదే మంచి అవకాశం. బరిలోకి దిగి భారీ స్కోర్లు చేయాలని కోరాడు. తమ ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో సరిగా ఆడలేదనే విషయం వారికి తెలుసు. అందువల్ల ముందుచూపుతో ఆడాలని సూచించాడు.

వెబ్దునియా పై చదవండి