వెల్లింగ్టన్ టెస్ట్: క్యూ కట్టిన భారత బ్యాట్స్‌మెన్స్
శుక్రవారం, 3 ఏప్రియల్ 2009 (09:03 IST)
ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో శుక్రవారం ప్రారంభమైన చివరి టెస్టులో భారత బ్యాట్స్మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా భారత్.. 204 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అర్థ సెంచరీతో రాణించడంతో 'టీమ్ ఇండియా' 200 మార్కును దాటింది. క్రీజ్‌లో కెప్టెన్ ధోనీ (15), స్పిన్నర్ హర్భజన్ సింగ్ (4)లు ఉన్నారు.
అంతకుముందు, వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వు స్టేడియంలో ఆరంభమైన మూడో టెస్టులో కివీస్ కెప్టెన్ డేనియల్ వెటోరి టాస్ గెలిచి భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఫలితంగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంభీర్, సెహ్వాగ్‌లు ఆరంభంలో ఆచితూచి ఆడుతూ, 73 పరుగుల ఓపెనింగ్ శుభారంభాన్ని ఇచ్చారు. ఆ క్రమంలో సెహ్వాగ్ (48) పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
అక్కడ నుంచి క్రమం తప్పకుండా భారత్ వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఒక దశలో 182 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ద్రావిడ్ మాత్రం ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ.. తన వికెట్‌ను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇన్నింగ్స్ 58.1 ఓవర్లో మార్టిన్ బౌలింగ్‌లో ఫ్రాంక్లిన్ క్యాచ్ పట్టడంతో ద్రావిడ్ తన వ్యక్తిగత స్కోరు 35 వద్ద అవుట్ అయ్యాడు.
దీంతో భారత్ తన ఆరో వికెట్‌ను 204 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ, భజ్జీలు ఆచితూచి ఆడుతున్నారు. భారత ఇన్నింగ్స్‌లో గంభీర్ 23, సెహ్వాగ్ 48, ద్రావిడ్ 35, టెండూల్కర్ 62, లక్ష్మణ్ 4, యువరాజ్ సింగ్ 9 చొప్పున పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మార్టిన్ రెండు వికెట్లు తీయగా, సౌథీ, ఓబ్రియాన్, ఫ్రాంక్లిన్, రైడర్లు ఒక్కో వికెట్ చొప్పున తీసి రాణించారు.