టెక్సాస్ బిలీయనీర్ స్టాన్‌ఫోర్డ్ దెబ్బకు.. ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, క్రికెటర్లకు కూడా పెద్ద షాక్ తగిలినట్లైంది. ఈ మేరకు స్టాన్‌ఫోర్డ్‌ను నమ్మి తాను కూడా డబ్బులు నష్టపోయినట్లు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మీడియాతో వాపోయాడు.
ఈ విషయమై పీటర్సన్ మాట్లాడుతూ... స్టాన్‌ఫోర్డ్‌తో గతంలో తాను వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నాననీ, తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఒప్పందాన్ని రుద్దు చేసుకున్నట్లయ్యిందనీ వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఒప్పందం విలువెంతో మాత్రం చెప్పేందుకు ఆయన నిరాకరించాడు.
స్థానిక పత్రికల కథనం ప్రకారం... పీటర్సన్ స్టాన్‌ఫోర్డ్‌తో రెండు సంవత్సరాల వ్యక్తిగత ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా, స్టాన్‌ఫోర్డ్ చర్యలతో తాను చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే... సెక్యూరిటీ కుంభకోణానికి పాల్పడిన ఈ అపర కుబేరుడు అలెన్ స్టాన్‌ఫోర్డ్‌తో తమకున్న అన్ని రకాల సంబంధాలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం తెగదెంపులు చేసుకున్న సంగతి విదితమే. ఈ మేరకు స్టాన్‌ఫోర్డ్ నిర్వహించనున్న అంటిగా ట్వంటీ20 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌లో నాలుగు దేశాల ట్వంటీ20 టోర్నీలలో కూడా పాల్గోరాదని ఈసీబీ నిర్ణయించిన సంగతి విదితమే.