దక్షిణాఫ్రికాలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో సీజన్లో పది ఓవర్ల తర్వాత ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ఐపీఎల్ లీగ్ కమీషనర్ లలిత్ మోడీ అన్నారు. ఆట మధ్యలో వ్యూహాలను రచించుకోవడానికే ఈ ఐదు నిమిషాల బ్రేక్ ఇస్తున్నామని మోడీ స్పష్టం చేశారు.
ఆట మధ్య ఆటతీరుపై వూహ్యాలకే గానీ, వాణిజ్య ప్రకటనల వల్ల వచ్చే డబ్బుకోసం మాత్రం కాదని మోడీ తేల్చి చెప్పేశారు. పది ఓవర్ల తర్వాత ఐదు నిమిషాల పాటు బ్రేక్ ఇస్తున్నామని, అయితే మ్యాచ్‌ల నిర్వహణలో ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఈ విరామాన్ని ఇస్తున్నట్లు మోడీ వివరించారు.
ఇదిలా ఉంటే.. కేప్‌టౌన్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో (4 గంటలకు) రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడనుండగా, 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) జట్లు బరిలోకి దిగనున్నాయి.
ఐపీఎల్ రెండో సీజన్లో మొత్తం 59 ట్వంటీ-20 మ్యాచ్‌లు జరుగుతాయని, కేప్ టౌన్, పోర్ట్ ఎలిజబెత్, డర్బన్, జోహెన్స్ బర్గ్, ప్రెటోరియా, ఈస్ట్ లండన్, బ్లోయెమ్ఫోంటైన్ వంటి నగరాలు ఈ మ్యాచ్‌లకు వేదికలు కానున్నాయని ఐపీఎల్ యాజమాన్యం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.