ఆ ముగ్గురు ఆటగాళ్లను తొలగించిన పిసిబి

ట్వంటీ-20 ప్రపంచ ప్రాబబుల్స్ కోసం ఎంపిక చేసిన ముగ్గురు ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. సోమవారం ప్రకటించిన ప్రాబబుల్స్‌ జాబితాలో ఐసీఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇమ్రాన్ నజీర్, రాణా నవీదుల్ హాసన్, అబ్దుల్ రజాక్‌లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. వీరి ఎంపికపై పీసీబీ చీఫ్ సెలక్టర్ ప్రత్యేకంగా వివరణ కూడా ఇచ్చారు.

దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు వీరికి సింథ్ కోర్టు అనుమతి ఇచ్చిందని, అందువల్ల వారికి ప్రాబబుల్స్‌లో చోటు కల్పించినట్టు వివరించారు. అయితే, ఈ ఎంపిక జరిగిన 24 గంటలు పూర్తికాక మునుపే వారిని తొలగించి, వారి స్థానంలో సయీద్ అజ్మల్, జూల్ఫికర్ జాన్, మొహ్మద్ హాఫీజ్‌లను ఎంపిక చేశారు.

ఈనెల 17-18వ తేదీల్లో జరుగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశంలో ఐసీఎల్‌కు సంబంధించి ప్రతికూల నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తుండటంతో పిసిబి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫలితంగా ఎంపిక చేసిన ఐసీఎల్ ఆటగాళ్లను ప్రాబబుల్స్ నుంచి తొలగించింది.

వెబ్దునియా పై చదవండి