తమ ఆటగాళ్లను కాంట్రాక్టుల నుంచి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ క్రికెట్ లీగ్ వెల్లడించింది. అయితే అక్టోబర్-నవంబరుల్లో జరిగే అంతర్జాతీయ ట్వంటీ-20 టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి ఆటగాళ్లు తిరిగి రావాలని ఐసీఎల్ పేర్కొంది.
ఐసీఎల్ కాంట్రాక్టుల నుంచి ఆటగాళ్లను విడుదల చేస్తే కివీస్, పాక్‌లకు చెందిన క్రికెటర్లకు జాతీయ జట్లలో స్థానం దక్కే అవకాశముంది. అంతేగాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీఎల్ ఆటగాళ్లు పాల్గొంటే తమ లీగ్‌కు విలువ పెరుగుతుందన్న ఉద్దేశంతో వారిని ఐసీఎల్ కాంట్రాక్టులను నుంచి తాము విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐసీఎల్ వెల్లడించింది.
ఆటగాళ్లను కాంట్రాక్టుల నుంచి విడుదల చేసే అంశంపై ఈ నెల 17వ తేదీన ఐసీఎల్ బోర్డు సమావేశం సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా.. ఐసీఎల్ ట్వంటీ-20 లీగ్ అప్పుల్లో కూరుకుపోలేదని, షెడ్యూల్ ప్రకారమే టీ-20 కొనసాగుతుందని ఐసీఎల్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.