ఆరోపణలు నిజమైతే థరూర్‌పై కఠిన చర్యలు: పీఎం

FILE
కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశిథరూర్‌పై వచ్చిన ఆరోపణలు గనుక రుజువైన పక్షంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. థరూర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారించి, అందులో వాస్తవాలు ఉన్నట్లయితే తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పారు.

కాగా.. యూఎస్ పర్యటన ముగించుకుని ప్రధాని శనివారం భారత్ తిరిగిరానున్నారు. ఈ మేరకు దేశానికి వచ్చిన తరువాత శశిథరూర్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను పరిశీలించి తరువాత విచారణకు ఆదేశిస్తానని ప్రధాని మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదంతో తలమునకలయ్యే శశిథరూర్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈయన పెళ్లి చేసుకోబోయే కాశ్మీరీ మహిళ సునంద పుష్కర్‌కు కొచ్చి ఐపీఎల్ జట్టు ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన రెండెవూ కన్సార్టియంలో 70 కోట్ల రూపాయల మేర ఉచిత వాటా ఉందన్న అంశంపై తీవ్రంగా దుమారం చెలరేగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శశిథరూర్‌పై ఆరోపణలు వెల్లువెత్తటంతో విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని పై విధంగా స్పందించారు.

వెబ్దునియా పై చదవండి