ఆశ్చర్యంలో ముంచెత్తిన హ్యాడ్లీ ప్రశంసలు: సచిన్

న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ నుంచి వచ్చిన ప్రశంసలు తనను ఆశ్చర్యచకితులను చేసినట్టు భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కివీస్‌ గ్రేట్‌ లెజండ్ సర్‌ రిచర్డ్ హ్యాడ్లీ సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ప్రపంచంలోనే సచిన్‌ను మించిన బ్యాట్స్‌మెన్‌ లేరని అతను కితాబిచ్చాడు. ఈ ప్రశంసలపై లిటిల్ మాస్టర్ ఉబ్బితబ్బిబ్బులయ్యాడు.

దీనిపై సచిన్‌ స్పందిస్తూ హ్యాడ్లీ వంటి దిగ్గజంతో ప్రశంసలు అందుకోవడం మరుపులేని అనుభూతికిలోను చేసిందన్నారు. తాను ఆరాధించే క్రికెటర్‌ బ్రాడ్‌మన్‌ కంటే తానే అత్యుత్తమ ఆటగాడని కితాబివ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడైన హ్యాడ్లీ వంటి క్రికెటర్‌ నుంచి అందిన ఈ ప్రశంసలు తన జీవితంలో మరచిపోలేనేవి అని వ్యాఖ్యానించారు.

తాను వ్యక్తిగతంగా అభిమానించే ఆటగాళ్లలో హ్యాడ్లీ ఒకరు. అపార అనుభవజ్ఞుడైన అతనిలాంటి క్రికెటర్‌ చాలా అరుదుగా లభిస్తారు. ప్రపంచ క్రికెట్‌లోనే హ్యాడ్లీ ఓ సరికొత్త ఒరవడిని సృష్టించారని సచిన్ అభిప్రాయపడ్డాడు. అతను క్రికెట్‌ ఆడడం ప్రారంభించే నాటికి తాను ఇంక జన్మించనే లేదు. అయితే యాధృచ్చికంగా అతనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనడం నిజంగా అదృష్టమే.

కాగా, అందరి అంచనాలకు అనుగుణంగా ఆడడం చాలా కష్టం. అందులో సఫలమైనప్పుడే ఏ క్రికెటరైనా ప్రశంసలు పొందక తప్పదు. అటువంటి కొందరిలో తాను కూడా ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. రానున్న రోజుల్లో నిలకడగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతానని సచిన్ వినమ్రయంగా వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి