టీం ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఆసియా కప్ క్రికెట్ షెడ్యూల్‌ను ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) విడుదల చేసింది. కాగా.. జూన్ 15వ తేదీనుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, ఆతిథ్య జట్టు శ్రీలంకలు తలపడనున్నాయి.
పదకొండు రోజులపాటు జరుగనున్న ఈ ఆసియా కప్‌లో మ్యాచ్‌లు సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్నాయి. ఒక్కో జట్టు మిగతా ప్రత్యర్థులతో మూడు మ్యాచ్‌లను ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు జూన్ 24వ తేదీన జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన జట్టుకు టైటిల్ దక్కుతుంది.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను ఐదు సంవత్సరాలపాటు నింబస్ స్పోర్ట్స్ దక్కించుకున్నట్లు ఏసీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఏసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్రఫుల్ హక్ మాట్లాడుచూ.. నింబస్ సహకారంతో ఆసియా కప్ విజయవంతం కాగలదని, ప్రపంచంలోని ఇతర దేశాలకూ ఇది విస్తరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.