వెస్టిండీస్ గడ్డపై 2007వ సంవత్సరం జరిగిన ఐసీసీ ప్రపంచకప్ పోటీల కోసం చేసిన ఏర్పాట్లలో దొర్లిన తప్పులను సరిదిద్దుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భరోసా ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ నుంచి ట్వంటీ-20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని, అలాంటి తప్పులు తిరిగి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది.
2007 సంవత్సరం ప్రపంచకప్ పోటీల టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో అభిమానులు అత్యధిక సంఖ్యలో మైదానంలో మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని కోల్పోయారు. దీనితో పలు మ్యాచ్‌లు స్టేడియంలో అభిమానులు, ప్రేక్షకులు లేకుండానే జరిగిపోయాయి.
సంగీతంతో పాటు క్రికెట్‌ను ఆస్వాదించే వెస్టిండీస్ అభిమానులకు క్రికెట్ ధరలు, ఐసీసీ ఆంక్షలు ఆందోళన పరిచాయి. ఈ కారణంగా ఆ దేశానికి చెందిన ప్రేక్షకులు ప్రపంచ కప్ మ్యాచ్‌లను మైదానంలో వీక్షించేందుకు సాహసం చేయలేదు.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ పోటీలకు టిక్కెట్ ధరల పెంపు, సంగీత కార్యక్రమాలకు ఐసీసీ ఆంక్షలు విధించడంపై పలు విమర్శలు వెలువెత్తాయి. ఈ విమర్శలను అంగీకరించిన ఐసీసీ పై విధంగా స్పందించింది. దీంతో పాటు కరేబియన్ గడ్డపై ఈసారి జరిగే ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీలకు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ప్రేక్షకులకు హామీ ఇచ్చింది.