ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ-20 ఛాంపియన్‌షిప్‌కు పాకిస్థాన్ యంగ్ మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్ గాయంతో దూరమయ్యే అవకాశం ఉందని తెలిసింది. దీంతో గాయాలతో ఐసీసీ ట్వంటీ-20కి దూరమైన పాక్ ఆటగాళ్ల జాబితాలో ఉమర్ అక్మల్ కూడా చేరుతాడని సమాచారం.
ఐసీసీ ట్వంటీ-20 కోసం జరిగిన శిక్షణా శిబిరంలో ప్రాక్టీస్ చేసిన ఉమర్ అక్మల్ గాయానికి గురైయ్యాడని పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే గాయం తీవ్రత పెద్దగా లేదని ఐసీసీ ట్వంటీ-20 ప్రారంభంలోపు అక్మల్ పూర్తిగా కోలుకుంటాడని తెలిసింది.
ఈ విషయమై పాకిస్థాన్ టీ-20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ఉమర్ అక్మల్ గాయం తీవ్రత ఆందోళనకరంగా లేదని, త్వరలో బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్ జట్టులోకి తిరిగి వస్తాడని చెప్పాడు. చేతివేలిలో అక్మల్‌కు గాయం తగిలిందని, అది తేలికపాటి గాయమేనని వెల్లడించింది.
ఇకపోతే.. ట్వంటీ-20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు శిక్షణలో నిమగ్నమైంది. ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించేందుకు పాక్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గత ఏడాది టీ-20 ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్, ఈసారి కూడా టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు తహతహలాడుతోంది. ఇప్పటికే పాక్ ఆల్‌రౌండర్లు ఫవాద్ ఆలమ్, యాజిర్ అరాఫత్‌లకు కూడా గాయాలకు గురైనట్లు సమాచారం.