ఐపీఎల్-3: చెన్నై-ఢిల్లీల మధ్య కీలక సమరం నేడే..!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. గురువారం జరిగే 50వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఫలితంగా గురువారం జరిగే 50వ లీగ్ మ్యాచ్‌.. ఇరు జట్లకు కీలకం కానుంది. సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు జరిగే ఈ కీలక పోటీలో ఇరు జట్లు నువ్వా..? నేనా..? అంటూ తలపడతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు సెమీఫైనల్ అవకాశాలు చేజారిపోయినట్లేనని వారు చెబుతున్నారు.

చెన్నై వేదికగా గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గంభీర్, ధోనీ సేనల మధ్య రసవత్తరమైన పోరు నెలకొంటుందని క్రీడా విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన 48వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీసేన విజృంభించి 9 వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. దీంతో ఐపీఎల్ పట్టికలో ఆరో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది.

కేకేఆర్‌పై గెలుపుతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీపై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉంది. కానీ సెమీస్ బెర్త్ కోసం గంభీర్ సేనకూడా రాణించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి