ఐపీఎల్-3: ఢిల్లీపై బెంగాల్ దాదా సేన కేకేఆర్ విజయం

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో జోరుమీదున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు, కోల్‌కతా నైట్‌రైడర్స్ అడ్డుకట్ట వేసింది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ సౌరవ్ గంగూలీ సేన 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దాదా సేన నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులను సాధించింది. ఓపెనర్లు క్రిస్‌గేల్, గంగూలీలు ప్రారంభం నుంచే మెరుపులు మెరిపించగా.. దాదా బౌండరీలతో ఢిల్లీ బౌలర్లను పరుగులు పెట్టించాడు. ఆ తరువాత రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన గేల్‌ భాటియా వేసిన స్లో బంతికి బౌల్డ్‌ అయి 40 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

ఆ తరువాత గంగూలీ 56 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, మెక్‌కల్లమ్ 6 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆపై బరిలో దిగిన మనోజ్ తివారీ 26 (నాటౌట్) పరుగులు, మాథ్యూ 46 పరుగులు(నాటౌట్)తో చివరి నాలుగు ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి రైడర్స్ 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించారు.

అనంతరం 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే సాధించి బోల్తా పడింది. డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ 64 పరుగులు, గౌతం గంభీర్ 47 పరుగులు మినహా ఢిల్లీ జట్టులోని మిగిలిన ఆటగాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోరును సాధించలేకపోయారు.

వెబ్దునియా పై చదవండి