ఐపీఎల్-3: పంజాబ్ కింగ్స్‌తో ముంబై సమరం రేపే.!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. శుక్రవారం జరిగే 41వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య పోటీ జరుగనుంది. మొహలీలో జరిగే ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్‌పై సునాయాసంగా నెగ్గే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటివరకు ఆడిన 9 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయాలను, రెండింటిలో పరాజయాలను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టు.. అగ్రస్థానంలో కొనసాగాలంటే పంజాబ్‌పై నెగ్గాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఇప్పటికే ఐపీఎల్ సెమీస్ ఆశలను చేతులారా చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్, ప్రతి మ్యాచ్‌లో నెగ్గి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. కానీ ఆదివారం కోల్‌కతాపై నెగ్గిన సంగక్కర సేన, బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 38వ లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఇండియన్స్‌పై జరిగే మ్యాచ్‌లోనూ పంజాబ్ కింగ్స్‌కు విజయావకాశాలు తక్కువేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మూడో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రమే పరాజయం పాలైంది.

వెబ్దునియా పై చదవండి