ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుపై డెక్కన్ ఛార్జర్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీ ఫైనల్ రేసులో నిలిచేందుకు ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డీసీ సత్తా చాటుకుంది. ఈ విజయంతో మొత్తం 14 పాయింట్లను సాధించిన డీసీ జట్టు ఐపీఎల్-3 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
కాగా.. సముద్ర మట్టానికి 1457 మీటర్ల ఎత్తులో ధర్మశాలలో ఉన్న ఒకే ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన డీసీ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మహేల జయవర్ధనే 93 (నాటౌట్) పరుగులతో, సంగక్కర 52 పరుగులతో డీసీ బౌలర్లను పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది.
అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ జట్టు ప్రారంభంలోనే కెప్టెన్ గిల్‌క్రిస్ట్ (9) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత మిశ్రా 20, సైమండ్స్ 4, మార్ష్ 15, సుమన్ 43 పరుగులతో రాణించారు. రోహిత్ శర్మ 68 (నాటౌట్) పరుగులతో మ్యాచ్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించటంతో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అందుకున్నాడు. తాజా విజయంతో సెమీస్ దారిని సుగమం చేసుకున్న డీసీ ఆఖరి లీగ్ మ్యాచ్ ఏఫ్రిల్ 18న ఢిల్లీతో ఆడనుంది.