చిత్రపరిశ్రమలో వారసత్వం, నెపోటిజంపై ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాతంతట అవేరావని పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. యంగ్ హీరో సుహాస్ నటించిన "ఓ భామ అయ్యో రామ" చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలో వారసత్వ నటులకే అవకాశాలు దక్కుతాయనేది ఒక అపవాదు మాత్రమే. సినిమా నేపథ్యం అనేది కేవలం పరిశ్రమలోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ నిలబడాలంటే ప్రతిభను నిరూపించుకోవాలని, ప్రేక్షకుల ఆదరణ పొందాలి. అపుడే ఎవరైనా రాణించగలరు అని అన్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు, మల్టీస్టారర్ సినిమాలు విజయాన్ని నిర్ణయించలేవని ఆయన అభిప్రాయపడ్డారు.
నటుడు సుహాస్ ప్రయాణాన్ని మనోజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. యూట్యూబ్ నుంచి కెరీర్ మొదలుపెట్టి, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇపుడు హీరో స్థాయికి ఎదగడం సుహాస్ కష్టానికి నిదర్శనం. అతని ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం, తమిళ నటుడు విజయ్ సేతుపతిలా ఒకవైపు హీరోగా, మరోవైపు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించడం అభినందనీయం అని కొనియాడారు.
కాగా, సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన "ఓ భామ అయ్యో రామ" చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడదలకానుంది.