బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. పక్షి బలంగా ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పాట్నాలోనే సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానానికి మరమ్మతులు చేసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరింది.
కాగా, ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. ఇటీవలే పాట్నా నుంచి రాంచీ వెళుతున్న మరో ఇండిగో విమానాన్ని గాల్లో ఓ గద్ద ఢీకొట్టింది. ఆ సమయంలో విమానం దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు ఉండగా, పైలెట్ చాకచర్యగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సురక్షితంగా దించారు.
అలాగే, జూన్ 23వ తేదీన తిరువనంతపురానికి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతున్నపుడు పక్షి ఢీకొట్టి ఉంటుందని అనుమానించారు. ఈ కారణంగా తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది.