ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. గురువారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఛార్జర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది.
టాస్ ఓడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులను సాధించింది. ప్రారంభంలోనే ఓపెనర్ మనీష్ పాండే వికెట్‌ను కోల్పోయినా, మరోవైపు కలిస్ పరుగుల వరద పారించాడు. ద్రవిడ్‌తో కలిస్ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ద్రవిడ్ తరువాత ఊతప్ప, రాస్ టేలర్‌లు వెంటవెంటనే పెవిలియన్ చేరటంతో ఒక దశలో బెంగళూర్ 68 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో కలిస్‌తో జతకట్టిన విరాట్ కోహ్లి ధాటిగా, ఆడుతూ జట్టును ఆదుకున్నాడు.
అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన డెక్కన్ ఛార్జర్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. డీసీ జట్టులో యువ ఆటగాడు సుమన్ 78 (నాటౌట్), సైమండ్స్ 53 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన డీసీ జట్టు ప్రారంభంలోనే మిశ్రా వికెట్ కోల్పోయినా, కెప్టెన్ గిల్లీతో జతకట్టిన సుమన్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు.