ఐపీఎల్-3: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌‌లో రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీస్ రేసులో నిలిచేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ గట్టి పోటీని ప్రదర్శించినా, ఎట్టకేలకు విజయం బెంగళూరునే వరించింది. దీంతో బెంగళూరు సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవటమేగాకుండా, కీలకమైన నెట్ రన్‌రేట్‌ను సైతం పెంచుకుంది.

టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే సాధించింది. కాగా.. వోజెస్ 28 (నాటౌట్), అభిషేక్ రౌత్ 32 పరుగుల కీలక భాగస్వామ్యం వల్లనే రాజస్థాన్ ఈ మాత్రం గౌరవప్రదమైన స్కోరును సాధించిందని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 6.5 ఓవర్లలో 58 పరుగులు జోడించారు.

ఆ తరువాత 131 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 15.4 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి అలవోకగా ఛేదించింది. బెంగళూరు బ్యాట్స్‌మన్‌లలో కెవిన్ పీటర్సన్ 62, కోహ్లి 14, రాహుల్ ద్రవిడ్ 5, టేలర్ 10, ఊతప్ప 26, పాండే 14లు పరుగులు సాధించటంతో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్-3 పాయింట్ల పట్టికలో 14 పాయింట్లను నమోదు చేసుకున్న బెంగళూరు, రెండో స్థానంలో నిలిచింది. కాగా.. 62 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన పీటర్సన్‌కు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు లభించింది.

వెబ్దునియా పై చదవండి