ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో తమ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంపై ఆ జట్టు యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఐపీఎల్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. కేకేఆర్ సెమీఫైనల్ అవకాశాలను చేజార్చుకోవడంపై అభిమానులు ఏమరుపాటుకు గురైయ్యారని, అందుకే తన జట్టు తరపున క్షమాపణలు చెబుతున్నానని షారూఖ్ అన్నారు.
బెంగాల్ దాదా, సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. బెంగళూరు, చెన్నై జట్లతో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోవడం ద్వారా సెమీఫైనల్ అవకాశాలను ఇంచుమించు చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఐపీఎల్-3లో తమ జట్టు పేలవమైన ఆటతీరుతో సెమీఫైనల్లోకి ప్రవేశించక అభిమానులను నిరాశకు గురిచేసిందని షారూఖ్ అన్నారు. ఐపీఎల్ తొలిరెండు సీజన్లలో కేకేఆర్ క్రికెటర్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించలేకపోయారు. ఫలితంగా సెమీఫైనల్ అవకాశాలు చేజారిపోయాయి. ఇదే తరహాలో ఐపీఎల్ మూడో సీజన్‌లోనూ కేకేఆర్ అభిమానులు ఆశించిన మేరకు మెరుగైన ఆటతీరును ప్రదర్శించలేకపోయిందని షారూఖ్ వాపోయాడు.
కాగా.. ఐపీఎల్ మూడో సీజన్‌లో కేకేఆర్ జట్టును అభిమానించిన ప్రేక్షకులకు, అభిమానులకు షారూఖ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కేకేఆర్ సెమీఫైనల్లోకి ప్రవేశించలేకపోవడం, గట్టిపోటీని ప్రదర్శించకపోవడానికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నట్లు షారూఖ్ అన్నారు.