కివీస్‌తో మూడోటెస్ట్: విజయం దిశగా భారత్

వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. తద్వారా సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కివీస్ గడ్డపై సిరీస్ విజయాన్ని రుచి చూసేందుకు టీమ్ ఇండియా సంసిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా మూడోటెస్ట్ నాలుగోరోజు ఆటముగిసే సమయానికి నలుగురు కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం ద్వారా విజయానికి భారత్ మరో ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో నాలుగోరోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు వద్ద కొనసాగుతోంది. టేలర్ (69), ఫ్రాంక్లిన్ (26)లు క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 349 పరుగులతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 434 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. తద్వారా భారత్ 617 పరుగుల విజయలక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. ఈ నేపథ్యంలో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింగి. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద మెక్లాంతోష్ (4) వికెట్‌ను కోల్పోయిన కివీస్ అటుపై ఫ్లైన్ (10), గుఫ్టిల్ (49), రైడర్ (0) వికెట్లను కోల్పోయింది. దీంతో టార్గెట్‌ను చేధించేందుకు కివీస్‌కు మరొక్కరోజు ఆట, ఆరు వికెట్లు మాత్రమే మిగిలి ఉంది.

ఈ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగుల స్కోరును సాధించింది. అటుపై తొలి ఇన్నింగ్స్ ఆడిన కివీస్ 197 పరుగులకే చతికిల పడింది. దీంతో 182 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్‌ మరోసారి భారీ స్కోరు సాధించింది.

వెబ్దునియా పై చదవండి