కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారం: ట్విట్టర్‌లో గుట్టు విప్పిన మోడీ

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో పాల్గొనే కొచ్చి ఫ్రాంచైజీకి సంబంధించిన రహస్య వాటాదారుల వివరాలను బయటపెట్టిన వ్యవహారంలో కేంద్ర మంత్రి శశిథరూర్‌ మరియు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.

కొచ్చి ఐపీఎల్ జట్టును కొనుగోలు చేసిన రెండెజ్‌వౌస్ సంస్థకు చెందిన వాటాదారుల రహస్యాలను ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తమ సంస్థకు చెందిన వివరాలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టడంపై స్పందించిన రెండెజ్‌వౌస్ సంస్థ ఈ విషయమై బీసీసీఐకి నోటీసు పంపింది.

కేంద్రమంత్రి శశి థరూర్ ఒత్తిడి మేరకే కొచ్చి ఐపీఎల్ జట్టును కొనుగోలు చేసినట్లు రెండెజ్‌వౌస్ తన నోటీసులో పేర్కొంది. ఇంకా కొచ్చి జట్టును కొనుగోలు చేసే విషయంలో శశిథరూర్ కీలక పాత్ర పోషించారని రెండెజ్‌వౌస్ తెలిపింది. లలిత్ మోడీతో శశిథరూర్ చర్చలు జరిపి కొచ్చి జట్టు తమ సంస్థకే దక్కేలా చేశారని రెండెజ్‌వౌస్ నోటీసులో స్పష్టం చేసింది.

అయితే ఈ చర్చల సందర్భంగా మోడీతో.. రెండెజ్‌వౌస్ సంస్థకు చెందిన రహస్య వాటాదారుల వివరాల జోలికి మాత్రం ఇప్పుడు వెళ్లొద్దని థరూర్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కొచ్చి జట్టును రెండెజ్‌వౌస్ కొనుగోలు చేయడంలో శశిథరూర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.

కానీ ఈ వివరాలను లలిత్ మోడీ ట్విట్టర్‌లో పేర్కొనడంపై రెండెజ్‌వౌస్ షాక్‌కు గురైంది. దీంతో లలిత్ మోడీ-శశిథరూర్‌ల ఫ్రాంచైజీల వ్యవహారాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లింది.

అయితే రెండెజ్‌వౌస్ నోటీసు, విమర్శలను కేంద్ర మంత్రి శశిథరూర్ కొట్టి పారేశారు. కొచ్చి జట్టు వేలం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే కొచ్చి జట్టును కొనుగోలు చేసిన రెండెజ్‌వౌస్ సంస్థకు తనకు ఎలాంటి సంబంధాలు లేవని శశిథరూర్ తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి