గంగూలీకి గాయం: బెంగళూరుతో కేకేఆర్ మ్యాచ్‌కు డౌటే!

PTI
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఫ్రాంచైజీ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గాయం ఏర్పడింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగే 43వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు సౌరవ్ దూరమయ్యే అవకాశం ఉందని జట్టు వర్గాల ద్వారా తెలిసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారం జరిగిన 39వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాణించాడు. ఈ సందర్భంగా గంగూలీ కాలికి గాయం తగిలింది. ఈ గాయానికి ఎమ్మారై స్కాన్ చేయడం జరిగిందని, స్కాన్ రిపోర్ట్స్ కోసమే గంగూలీ ఎదురుచూస్తున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి.

కాగా.. ఇప్పటికే బెంగళూరుకు కోల్‌కతా జట్టు చేరుకుంది. గంగూలీ గాయానికి గురికావడంతో శనివారం బెంగళూరుకు చేరుకుంటాడని తెలిసింది.

ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో 56 పరుగులు సాధించి జట్టుకు 181/3 పరుగుల స్కోరును సంపాదించిపెట్టాడు.

ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఆటతీరును ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ కితాబిచ్చాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే నాయకత్వంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఆడకపోవడం కేకేఆర్‌కు మైనస్సేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి