గతం సరే.. వర్తమానమే ముఖ్యం : ధోనీ

ఆయన సారథ్యంలో టీం ఇండియా ఎప్పుడూ కూడా తప్పటడుగులు వేయలేదుగానీ... గతం సాధించిన విజయాలను అడ్డుపెట్టుకుని మాట్లాడే రకం కాదని నిరూపించాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అందుకనే ఆయన గతాన్ని లెక్కించుకోననీ.. సరికొత్త ఉత్సాహంతో రేపటి మ్యాచ్‌లో పాల్గొంటామని ధీమాగా చెబుతున్నాడు.

బుధవారం క్రైస్ట్ చర్చ్‌లో కివీస్ జట్టుతో తొలి ట్వంటీ20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. తాము కెరీర్ ప్రారంభిస్తున్నంత జాగ్రత్తగా ఈ మ్యాచ్‌లో ఆడతామని చెప్పాడు. ఆ మాటకొస్తే... ప్రతి పోటీనీ తాను మొదటి మ్యాచ్‌గానే చూస్తానని ఈ జార్ఖండ్ డైనమైట్ పేర్కొన్నాడు.

ప్రపంచ క్రికెట్లో ధోనీ సేన మెరుగ్గానే ఉన్నప్పటికీ... ఆటగాళ్లను బట్టి చూస్తే కివీస్ కంటే బలమైన జట్టుగానే కనిపిస్తుందని ధోనీ వివరించాడు. కేవలం కాగితపు పులుల్లాగా అనిపించుకునే పరిస్థితిలో టీం ఇండియా ఎన్నడూ ఉండబోదనీ... ప్రతి పోటీనీ తాజాగా ఆడుతున్నట్లుగానే తామందరం భావిస్తామని ఆయన స్పష్టం చేశాడు.

బుధవారం జరిగే మ్యాచ్ మిగతా సిరీస్‌ అంతటికీ మార్గదర్శకం కాదనీ, మొదటి మ్యాచ్ గెలిస్తే మిగతా సిరీస్ మీద దాని ప్రభావం ఉంటుందని భావించడానికి వీల్లేదని భారత కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఈ 50 రోజుల పర్యటనలో దాదాపు అన్ని పోటీల్లో నిలకడగా, నిబ్బరంగా ఆడే జట్టే విజేత కాగలదని అన్నాడు. అందుకనే ప్రతి ఒక్కరూ విధిగా కష్టపడాలనీ, విజయానికి తమవంతు కృషి అందిచాలని... అది ఏ ఒకరిద్దరి వల్లనో కాకుండా, సమిష్టిగా జట్టు విజయానికి పాటుపడాలని ధోనీ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి