చెత్తగా ఆడటంతోనే ఓడిపోయాం..!: సౌరవ్ గంగూలీ

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన 43వ లీగ్ మ్యాచ్‌లో చెత్తగా ఆడటంతోనే పరాజయం పాలైయ్యామని కోల్‌కతా నైట్‌ రైడర్స్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బెంగళూరు చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడటానికి కేకేఆర్ పేలవమైన ఆటతీరే కారణమని గంగూలీ తెలిపాడు.

తొలి పది ఓవర్లలో తమ జట్టు బాగా ఆడిందని, చివరి పది ఓవర్లలో కేకేఆర్ తడబడిందని.. మొత్తానికి తమ జట్టు చెత్తగా ఆడిందని గంగూలీ అన్నాడు. ఫీల్డింగ్ బాగా చేసినా.. బెంగళూరు బ్యాట్స్‌మెన్లను బౌలర్లు కట్టడి చేయలేకపోయారని గంగూలీ వాపోయాడు. కేకేఆర్ టాప్ బ్యాటింగ్ ఆర్డర్‌తో తొలి పది ఓవర్లలో 101 పరుగులు సాధించింది.

కానీ తర్వాతి పది ఓవర్లలో బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారని గంగూలీ అన్నాడు. ఇదేవిధంగా బౌలింగ్ కూడా సరిగ్గా లేదని సౌరవ్ చెప్పాడు. అయితే తదుపరి మ్యాచ్‌లో గెలిచేందుకు తమ జట్టు రాణించేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని కెప్టెన్ చెప్పాడు. అనిల్ కుంబ్లే సేన కేకేఆర్‌పై నెగ్గడం ద్వారా ఐపీఎల్ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకడంపై గంగూలీ ప్రశంసించాడు.

ఇకపోతే... ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన బెంగళూరు.. ఆరింటిలో విజయం సాధించింది. దీంతో ఢిల్లీని వెనక్కి ఐపీఎల్ పట్టికలో నెట్టి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా తొలిస్థానాన్ని సచిన్ సేన ముంబై ఇండియన్స్ కైవసం చేసుకోగా, మూడో స్థానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి