టెస్ట్ ఫలితంపై ధోనీ తీవ్ర అసంతృప్తి

టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్ టెస్ట్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆతిథ్య దేశంతో వెల్లింగ్టన్‌లో జరిగిన కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంతో టీం ఇండియా టెస్ట్ సిరీస్‌ను 0-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మాట్లాడుతూ.. మరో పది ఓవర్లు లభించినట్లయితే ఫలితం మరోలా ఉండేదన్నాడు. న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసేందుకు భారత్ రెండు వికెట్ల దూరంలోనే నిలిచింది. వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయి, చివరకు డ్రా అయింది. అయితే వర్షం రావడానికి ముందు మరో పది ఓవర్లు పడతాయని భావించాను.

అయితే మ్యాచ్ డ్రా అవడం కొద్దిగా నిరాశపరిచిందని ధోనీ చెప్పాడు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. రెండు, మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. చివరి రోజు పనిపూర్తి చేసేందుకు మరికొన్ని ఓవర్లు లభిస్తాయనుకున్నానని ధోనీ చెప్పాడు.

అసాధ్యమైన 617 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన న్యూజిలాండ్ మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు వర్షం బాగా ఉపయోగపడింది. వర్షం వచ్చే సమయానికి న్యూజిలాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. అయితే మొత్తంమీద జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి