టెస్ట్ ర్యాంకింగ్స్: మెరుగు పడిన లక్ష్మణ్ ర్యాంకు

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును భారత జట్టు డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించిన జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్- 20లోకి ప్రవేశించాడు. రెండో టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా జాబితాలో లక్ష్మణ్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకొని 15వ స్థానానికి ఎగబాకాడు.

ఇదిలా ఉంటే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ 17వ స్థానంలో నిలిచాడు. ఇషాంత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. కాగా, ఈ స్థానానికి చేరేందుకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్, పాకిస్థాన్ స్పిన్నర్ డానిష్ కనేరియా, ఇంగ్లాండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్‌లను ఇషాంత్ వెనక్కునెట్టాడు.

టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తాజా ర్యాంకింగ్స్‌లో లక్ష్మణ్ కంటే ఒక ర్యాంకు ముందు నిలిచాడు. మరోవైపు రెండో టెస్ట్‌లో టీం ఇండియాకు ఆపద్భాందవుడిగా నిలిచిన ఓపెనర్ గౌతం గంభీర్ ఐదో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ మహేల జయవర్దనే- గంభీర్‌కు మధ్య అతిస్వల్ప తేడా మాత్రమే ఉంది.

వెబ్దునియా పై చదవండి