డర్బన్ వన్డే: ఆస్ట్రేలియా విజయభేరి

శనివారం, 4 ఏప్రియల్ 2009 (09:09 IST)
పటిష్టమైన ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఘోర పరాజయం చవిచూసింది. తొలి రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లలో పరాజయం పాలైన కంగారులు, శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ప్రతీకారం తీర్చుకున్నారు. ఫలితంగా 142 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం డర్బన్‌లో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరిగింది.

తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 286 పరుగులు చేసింది. ఆ జట్టులో మైక్ హస్సీ చెలరేగి 79 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. హస్సీకి హాడిన్ (53) అర్థ సెంచరీతో రాణించడంతో కంగారులు భారీ విజయలక్ష్యాన్ని సఫారీల ముంగిట ఉంచారు.

ఆ తర్వాత 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్ పేసర్ల ధాటికి కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మిత్ (52), గిబ్స్ (33) మినహా మిగిలినా బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేదు. ఫలితంగా తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు సొంతగడ్డపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

వెబ్దునియా పై చదవండి