డిక్లేర్ నిర్ణయాన్ని సమర్థించిన యువరాజ్ సింగ్

టీం ఇండియా స్టార్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ మూడో టెస్ట్‌లో జట్టు డిక్లేర్ నిర్ణయాన్ని సమర్థించాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంలో భారత్ జాప్యం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం సరైనదేనని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

అయితే వర్షం వస్తుందనే ఊహాగానాలు నిజమైతే, టీం ఇండియా విజయాన్ని ఈ నిర్ణయం అడ్డుకునే అవకాశం ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 531 పరుగుల ఆధిక్యాన్ని మూటగట్టుకున్న భారత్ నాలుగో రోజు ఉదయం 85 నిమిషాలపాటు బ్యాటింగ్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను 434 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

దీంతో భారత్ మొత్తం ఆధిక్యం 617 పరుగులకు చేరింది. ఇంత స్కోరు వరకు డిక్లేర్ చేయకపోవడంపై యూవీ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు బోర్డుపై ఉంచాలనేది తమ వ్యూహమన్నాడు.

తమకు మ్యాచ్ గెలిచేందుకు కావాల్సినంత సమయం ఉంది. చివరి రోజు వర్షం వస్తుందనే అంచనాలు మా దృష్టికి కూడా వచ్చాయి. వర్షం వస్తుందని విన్నాము. సాధ్యమైనంత త్వరగా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని, 600 పరుగుల లక్ష్యాన్ని బోర్డుపై ఉంచాలని భావించామని యువరాజ్ చెప్పాడు. న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి