వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ గంభీర్ సెంచరీ సాధించడంతో టీం ఇండియాకు భారీ ఆధిక్యత లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 182 పరుగుల ఆధిక్యతతో కలిపి టీం ఇండియా ఇప్పుడు మొత్తం 531 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
యువరాజ్ సింగ్ 15 పరుగులు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 16 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజ్‌లో ఉన్నారు. 51/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ గంభీర్ సెంచరీ (167), ద్రావిడ్ (60), వీవీఎస్ లక్ష్మణ్ (61) అర్ధ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ (9) రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు.
ద్రావిడ్, టెండూల్కర్ వెంటవెంటనే అవుట్‌చేసిన ఆనందంలో ఉన్న కివీస్ బౌలర్లకు గంభీర్, లక్ష్మణ్ జోడి మళ్లీ చెమటలు పట్టించారు. 35 ఓవర్లకుపైగా కొనసాగిన లక్ష్మణ్, గంభీర్ భాగస్వామ్యాన్ని చివరి సెషన్‌లో కివీస్ బౌలర్లు విడగొట్టారు. రెండు ఓవర్ల తేడాతో గంభీర్, లక్ష్మణ్ ఇద్దరినీ పేవీలియన్ దారిపట్టించారు. అయితే అప్పటికే స్కోరు 300 పరుగులు దాటడంతో భారత్ భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకుంది.
ఇదిలా ఉంటే ముందురోజు భారత బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ 197 పరుగులకే ఆలౌటయింది. జహీర్ ఖాన్ ఐదు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రారంభంలోనే సెహ్వాగ్ వికెట్ కోల్పోయింది.
అంతకుముందు తొలి టాస్ ఓడిపోయి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ సచిన్ టెండూల్కర్ (62), ధోనీ (52), హర్భజన్ సింగ్ (60) అర్ధ సెంచరీలతో రాణించడంతో 379 పరుగులు చేసి ఆలౌటయింది. కీలకమైన ఈ మూడో టెస్ట్‌లో విజయం సాధిస్తేనే ఆతిథ్య జట్టు సిరీస్‌ను సమం చేయగలదు. భారత్ తొలి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.