పాక్ ఆశలను సజీవం చేసిన యూనిస్

కళ్ల ఎదుట 644 పరుగుల భారీ స్కోరు ఉన్నప్పటికీ కలవరపడకుండా... బొంగరంలాగా తిరిగే బంతులను ఎదుర్కొంటూ, జీవంలేని పిచ్‌పై అమూల్యమైన ఇన్నింగ్స్‌తో పాక్ ఆశలను సజీవంగా ఉంచాడు ఆ జట్టు కెప్టెన్ యూనిస్‌ఖాన్. అజేయమైన సెంచరీతో సారథిగా తనకు ఎదురైన తొలి సవాల్‌ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని జట్టుకు మార్గదర్శకంగా నిలిచాడు.

కరాచీలో శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో.. లంక విధించిన భారీ స్కోరును చేధించే లక్ష్యంతో బరిలో దిగిన పాక్ జట్టు ధీటుగా ఆడుతోంది. సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించింది. కెప్టెన్ యూనిస్ 149, మిస్బా ఉల్‌హక్ 20 పరుగులతో ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

అంతకు మునుపు 44/1 స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన పాక్ కొద్ది సేపటికే ఖుర్రమ్ మంజూర్ (27)ను కోల్పోయింది. ఆ తరువాత బరిలో దిగిన మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ నుంచి యూనిస్‌కు చక్కటి సహకారం లభించటండో... ఇద్దరూ సెషన్ల వారీగా ఇన్నింగ్స్‌ను క్రమంగా నిర్మించుకుంటూ సాగిపోయారు. ఈ క్రమంలో యూనిస్ 191 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

టీ విరామం అనంతరం మాలిక్ అర్థ శతకం సాధించగా... మూడో వికెట్‌కు మాలిక్, యూనిస్‌లు ఇరువురూ 149 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో షోయబ్ రన్‌అవుట్‌తో వెనుదిరగడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత వచ్చి మిస్బా.. కెప్టెన్ జతకట్టాడు. కాగా, లంక తొలి ఇన్నింగ్స్ 644/7కు డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి