పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, పీసీబీ తనపై విధించిన నిషేధంపై అప్పీలు చేసుకున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుచే ఇటీవల 12 నెలల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో పాటు షోయబ్ మాలిక్ రెండు మిలియన్ డాలర్లను జరిమానా చెల్లించాల్సిందిగా పీసీబీ ఆదేశించింది.
ప్రస్తుతం పెళ్లి హడావుడిలో ఉన్న షోయబ్ మాలిక్, పీసీబీ నిషేధంపై బుధవారం అప్పీలు చేసుకున్నాడు. ఇప్పటికే పీసీబీచే ఏడుగురు క్రికెటర్లపై నిషేధం వేటుతో పాటు జరిమానా భారం పడింది. దీంతో నిషేధానికి గురైన క్రికెటర్లందరూ ఒక్కొక్కరిగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ కూడా నిషేధంపై అప్పీలు చేసుకున్నాడు.
మాలిక్ తరపున అతని న్యాయవాది, సలహాదారు అహ్మద్ హుస్సేన్ అప్పీల్ పంపినట్లు చెప్పారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించిన న్యాయమూర్తి విచారణ జరుపుతారని హుస్సేన్ వెల్లడించారు. కాగా నిషేధంపై అప్పీలు చేసుకోవడానికి ఈ నెల 17వ తేదీ తుదిగడువు కావడంతో రెండు రోజులు ముందుగానే మాలిక్ అప్పీలును పంపడం గమనార్హం.