మాస్టర్ బ్లాస్టర్‌పై కివీస్ ఆటగాళ్ల ప్రశంసలు

భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌పై న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపించారు. పాంటింగ్, లారాకంటే టీం ఇండియా బ్యాట్స్‌మన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెంబర్ వన్ అని న్యూజిలాండ్ కెప్టెన్ డానియల్ వెటోరి చెప్పాడు. ఆధునిక క్రికెట్లో సచిన్, పాంటింగ్, లారాల్లో ఎవరు ఉత్తమం అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సచినే టాప్ అని, అతడే నెంబర్ వన్ అని తెలిపాడు.

పాంటింగ్ నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ మాస్టర్ బ్లాస్టరే నెంబర్ వన్ అని వెటోరి తెలిపాడు. ఆస్ట్రేలియాను ఓడించిన భారత జట్టుపై తమకు ఎంతో గౌరవముందని అతడు అన్నాడు. అదేవిధంగా... స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో లక్ష్మణ్ ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మన్ అని వెటోరి కొనియాడాడు.

ఇదేవిధంగా... సచిన్‌పై మరో కివీస్ బ్యాట్స్‌మన్ టేలర్ ప్రశంసలతో ముంచెత్తాడు. మైదానంలో సచిన్ ఆటతీరును వీక్షించేందుకు వేయి కనులు కావాలని కొనియాడాడు. అతడు ఆడే విధానం తనకెంతో నచ్చిందని టేలర్ అన్నాడు. సచిన్ ఆటతీరును చూసేందుకే తాను క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టానని రాస్ టేలర్ తెలిపాడు. సచిన్ ఆటను చూసేందుకు తాను క్రికెట్ కెరీర్‌ను ఎంచుకున్నానని అతడు వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి