"ముంబయి" దెబ్బకు "బ్యార్‌"మన్న ఢిల్లీ డేర్ డెవిల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 47 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ దెబ్బకు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ బ్యార్‌మన్నది. దీంతో ఢిల్లీపై ముంబయి ఇండియన్స్ జట్టు 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని తన సత్తాను మరోసారి చాటుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సచిన్ సేన నిలకడగా ఆడేందుకు యత్నించింది. ఓపెనర్లు అంతగా రాణించలేకపోయారు. సచిన్ టెండూల్కర్ సైతం 26 బంతుల్లో 30 పరుగులే చేయగలిగాడు. ఇక రాయుడు, మదాన్ పరిస్థితీ అంతే. అయితే వీరి తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన దుమిని, పొల్లార్డ్ వీరబాదుడు బాదారు.

దుమిని 14 బంతుల్లో 21 పరుగులు చేస్తే పొల్లార్డ్ కేవలం 13 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉతికి ఏకంగా 45 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. దీంతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేయగలిగింది.

ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలో కాస్త దూకుడుగా ఆడినా ఆ తర్వాత వరుసగా వికెట్లను పారేసుకుంటూ పోయింది. వార్నర్, సెహ్వాగ్, డొనాల్డ్ మినహా మిగిలనవారంతా పెవిలియన్‌ దారి పట్టేందుకు పోటీ పడ్డారు. ముఖ్యంగా డీ విలియర్స్, కాలింగ్‌వుడ్ కీలక వికెట్లను ముంబయి పడగొట్టడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా వికెట్లు కూలతాయేమోనన్న భయంతో పరుగులు రాబట్టలేకపోయారు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులను మాత్రమే చేయగలిగింది.

వెబ్దునియా పై చదవండి