ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) క్రికెటర్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కరుణ చూపుతోంది. ఐసీఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన తమ దేశ క్రికెటర్లలో ముగ్గురుకి ట్వంటీ-20 ప్రపంచ కప్ ప్రాబబుల్స్ జాబితాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చోటు కల్పించింది. జూన్ నెలలో ఇంగ్లండ్‌లో జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కోసం కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు.
ఇందులో అబ్దుల్ రజాక్, రాణా నవీద్, ఇమ్రాన్ నజీర్లకు చోటు దక్కింది. వీరు ఐసీఎల్‌లో క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. దీనిపై పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ తుది జట్టును క్రికెట్ బోర్డు అనుమతి మేరకు ఎంపిక చేస్తామన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఇచ్చే ఆదేశాల మేరకు పిసిబి ఇచ్చే క్లియరెన్స్ ఆధారంగా వారిని తుది జట్టులోకి ఎంపిక చేస్తామని చెప్పారు.
వీరు ముగ్గురు ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నారని, ముఖ్యంగా ట్వంటీ-20 ఫార్మెట్కు మంచి క్రికెటర్లన్నారు. దేశవాళీ క్రికెట్లో పాల్గొనవచ్చని సింధ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఈ ముగ్గురు క్రికెటర్లు బాగా రాణిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా, నవీద్, ఇమ్రాన్ నజీర్‌లు లాహోర్ బాద్షా జట్టు తరపున రజాక్ హైదరాబాబ్ హీరోస్ తరపున ఐఎసీఎల్లో ఆడుతున్న విషయం తెల్సిందే.