మూడో వన్డేలో ఆటగాళ్లు రాణిస్తారు: పాంటింగ్

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తాము తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. మూడో వన్డేలో తమ ఓపెనర్లు బ్రాడ్ హాడిన్, మైకెల్ క్లార్క్ పుంజుకుంటారని చెప్పాడు. రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ నిలువునా కుప్పుకూలిన సంగతి తెలిసిందే.

సెంచూరియన్ పార్కులో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను దక్షిణాఫ్రికా బౌలర్లు వేనె పార్నెల్ (4-25), డాలె స్టెయిన్ (4-27) బెంబేలెత్తించారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 131 పరుగులకే ఆలౌటయింది. దక్షిణాఫ్రికా 26.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వన్డే సిరీస్ 1-1తో సమం అయింది.

రెండో టెస్ట్‌లో ఘోర పరాజయంపై పాంటింగ్ మాట్లాడుతూ.. తరువాతి మ్యాచ్‌కు జట్టులో సమూల మార్పులు అవసరం లేదని చెప్పాడు. తమ ఆటగాళ్లను కొద్దిగా మెరుగ్గా ఆడితే సరిపోతుందని ఓ ఆస్ట్రేలియా పత్రికతో పాంటింగ్ పేర్కొన్నాడు. వన్డేల్లో నిరాశపరుస్తున్న తన ప్రదర్శన కూడా మెరుగుపడుతుందని, ఒకసారి పెద్ద స్కోరు చేయడంతో పరిస్థితి సరిచేయవచ్చని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. పాంటింగ్ వన్డేల్లో 14 నెలల క్రితం చివరి సెంచరీ చేశాడు.

వెబ్దునియా పై చదవండి