ఈనెల 22వ తేదీ నుంచి ఆస్ట్రేలియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ యధావిధిగా జరుగుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ తెలిపారు. ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ సిరీస్ వాయిదా పడటం లేదా రద్దు కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై ఇజాజ్ భట్ మాట్లాడుతూ.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈనెల 22వ తేదీ నుంచి ఆరంభం కావాల్సిన షెడ్యూల్‌పై ఆయన స్పందిస్తూ.. ఇరు జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కోసం అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. దుబాయ్‌లో ఈ మ్యాచ్‌లను నిర్వహించేలా ఇరు జట్ల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరిందన్నారు. సిరీస్ వాయిదా వేసేందుకు లేదా రద్దయ్యేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. తొలి మ్యాచ్ ఈనెల 22వ తేదీన జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
మరో రెండు రోజుల్లో సిరీస్ స్పాన్సర్లను వెల్లడిస్తాం. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో స్పాన్సర్లను ఒకే మొత్తంలో రాబట్టలేక పోయామని చెప్పారు. అయితే, వివిధ సంస్థలకు చెందిన స్పాన్సర్లను పొందడంలో క్రికెట్ బోర్డు సఫలీకృతమైందని చెప్పారు. కాగా, భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేందుకు ఆసీస్ ఆటగాళ్లు నిరాకరించిన విషయం తెల్సిందే.