ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా సచిన్ టెండూల్కర్ సేన సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన 45వ లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 37 పరుగుల తేడాతో రాయల్స్‌ను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకే కుప్పకూలింది.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ప్రారంభంలోనే తడబడింది. రాయల్స్ ఆటగాళ్లలో లంబ్ (8), ఓజా (0), ఫజల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. చివర్లో డోలె (30), రౌట్ (20) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
కానీ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, డుమిని, పోలాండ్ భాగస్వామ్యంతో చెలరేగి ఆడాడు. దీంతో తన భారీ షాట్లతో సచిన్ టెండూల్కర్ 59 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్‌లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇకపోతే పోలాండ్ (25), డుమిని (31)లు జట్టుకు భారీ స్కోరును సంపాదించిపెట్టడంలో సచిన్‌కు అద్భుత సహకారం అందించారు. దీంతో సచిన్ సేన రాజస్థాన్‌ను మట్టికరిపించి, ఐపీఎల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఇకపోతే.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో వాట్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే డోలె, త్రివేదిలు చెరో వికెట్ సాధించారు. ముంబై బౌలర్లలో జహీర్ ఖాన్ రెండు, కులకర్ణి, భజ్జీ, పోలార్డ్ తలా ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో వీర విహారం చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీంతో మాస్టర్ ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.