రూ.15 లక్షలు నజరానా ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్ పర్యటనలో 41 ఏళ్ల తరువాత టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా సభ్యులకు బీసీసీఐ మంగళవారం ఒక్కొక్కరికి రూ.15 లక్షల బోనస్ ప్రకటించింది. విజయావకాశాలు పుష్కలంగా ఉన్న వెల్లింగ్టన్ టెస్ట్‌ను వర్షం కారణంగా టీం ఇండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ గడ్డపై తాజా టెస్ట్ సిరీస్‌ను టీం ఇండియా 1-0తో కైవసం చేసుకుంది.

ఈ చారిత్రాత్మక విజయం సాధించిన జట్టుకు వెంటనే బీసీసీఐ బోనస్ ప్రకటించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను కూడా టీం ఇండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయాలు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అభినందించారు.

టెస్ట్, వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుల్లోని ఒక్క ఆటగాడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల బోనస్ ప్రకటించారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నేతృత్వంలోని భారత జట్టు 1967- 68లో చివరిసారి న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్లీ టెస్ట్ సిరీస్ విజయాన్ని మహేంద్ర సింగ్ ధోనీ సేన సాధించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా 3-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి