రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై విండీస్ విజయం

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో జట్టు కోచ్ డైసన్ తప్పుడు లెక్కల ఫలితంగా అనూహ్యంగా ఓటమి పాలైన విండీస్ జట్టు.. రెండో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టును ఖంగుతినిపించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో 264 పరుగులు చేసింది.

ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చందర్‌పాల్ (112), శర్వాణ్ (74) పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నారు. 24 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన విండీస్‌ను శర్వాణ్, చందర్‌పాల్‌లు కష్టాల నుంచి గట్టెక్కించారు. అనంతరం 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లు 48.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

జట్టు ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్ట్రాస్ (102) సెంచరీతో రాణించినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ అండగా నిలువ లేక పోయారు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలుకాక తప్పలేదు. విండీస్ బౌలర్లు సమిష్టిగా రాణించి వికెట్లు పడగొట్టారు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును చందర్‌పాల్ అందుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి