వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్

ఐదు వన్డేల సిరీస్‌ను పర్యాటక ఇంగ్లండ్ జట్టు కైవసం చేసుకుంది. సెయింట్‌ లూయిస్‌లో జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ జట్టు జైత్రయాత్ర సాగించింది. చివరి వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ హ్యాట్రిక్ (5-19) సాధించాడు. దీంతో అతనికి "మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్"‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌కు "మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌" అవార్డు దక్కింది.

అంతకు ముందు వర్షం కారణంగా మ్యాచ్‌ను 29 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. పీటర్సన్‌ (48), రవి బోపారా (44), పాల్ కాలింగ్‌వుడ్‌ (35 నాటౌట్‌)లు రాణించగా, స్ట్రాస్‌ (3), ఒవైషా (6), ఫ్లింటాఫ్‌ (3)లు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో ఫోర్డ్, బెన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 28 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ అయింది.

బ్రావో (33), పొర్డ్ (30)లు మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ జట్టు ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, బౌలింగ్‌లో తన సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో రామ్‌దిన్ (12), రాంపాల్ (0), బెన్ (0)లను వరుస బంతుల్లో ఫ్లింటాఫ్ అవుట్ చేశాడు. ఫలితంగా 28 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి