ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు వరుస ఓటములు తప్పటం లేదు. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడిన పంజాబ్, 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో పరాజయం పాలైన పంజాబ్, ఆరో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే ధీమాతో బరిలో దిగిన పంజాబ్ పప్పుల్ని రాయల్స్ ఏ మాత్రం ఉడకనీయలేదు.
అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సంగక్కర బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జయవర్ధనే 44, యువరాజ్ సింగ్ 28, ఇర్ఫాన్ పటాన్ 24 (నాటౌట్) పరుగులతో రాణించటంతో నిర్ణీత ఓవర్లలో పంజాబ్ 153 పరుగులు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో డొలే, త్రివేదిలు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రం కోల్పోయి, మరో 30 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ మైకేల్ లంబ్ 43 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 83 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లను వణికించాడు. అలాగే నామన్ ఓజా 44 (నాటౌట్), యూసుఫ్ పఠాన్ 21 (నాటౌట్) పరుగులు సాధించారు. కాగా.. లంబ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.