వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ ఆరంభంలో తడబడినా టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్ల పుణ్యమాని కోలుకుంది. ఫలితంగా తొలి రోజు ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. సచిన్ (62), హర్భజన్ సింగ్ (60), ధోనీ (52)లు అర్థ సెంచరీలతో రాణించడంతో భారత్ 300 పైచిలుకు పరుగులు సాధించింది. వీరికి తోడు సెహ్వాగ్ (48), ద్రావిడ్ (35), జహీర్‌ఖాన్ (33)లు ఆదుకున్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు సాధించింది. ఇషాంత్ శర్మ (15), మునాఫ్ పటేల్ (14)లు క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మరో ఆలోచన లేకుండా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు 73 పరుగుల స్కోరు వద్ద తొలిదెబ్బ తగిలింది. ఓబ్రైన్ బౌలింగ్‌లో 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన సెహ్వాగ్ కొద్దిలో ఆర్థ సెంచరీ చేజార్చుకున్నాడు. అటుపై వెంటనే మరో ఓపెనర్ గంభీర్ (23) సైతం పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 75 పరుగులకే భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయినట్టైంది.
అటుపై ద్రావిడ్‌కు జత కలిసిన సచిన్ నిలకడగా ఆడాడు. అయితే జట్టు స్కోరు 165 పరుగుల వద్ద అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని కొనసాగుతున్న సచిన్ ఔటయ్యాడు. అటుపై క్రీజులోకి వచ్చిన లక్ష్మణ్ (4) తక్కువ పరుగులకే క్రీజునుంచి నిష్క్రమించాడు. లక్ష్మణ్ తర్వాత వచ్చిన యువరాజ్‌సింగ్ (9) సైతం తక్కువ పరుగులకే ఔటయ్యాడు.
యువరాజ్ తర్వాత ద్రావిడ్ (35) సైతం ఔటయినా వీరి తర్వాత ధోనీ, హర్భజన్, జహీర్‌ఖాన్‌లు నిలకడగా ఆడడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది.