శశిథరూర్-మోడీల వ్యవహారంపై 10 రోజుల్లో సమావేశం!: బీసీసీఐ

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌ కోసం ఎంపికైన కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి శశిథరూర్- ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంపై రానున్న పది రోజుల్లో ఐపీఎల్ కౌన్సిల్‌తో సమావేశం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం వెల్లడించింది.

కొచ్చి ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేసిన రెండెజ్‌వౌస్ సంస్థకు చెందిన రహస్య వాటాదారుల వివరాలను ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ట్విట్టర్‌లో బయటపెట్టడంతో రెండెజ్‌వౌస్ సంస్థ బీసీసీఐకి నోటీసు పంపింది. ఈ నోటీసులో కొచ్చి ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేయడంలో శశిథరూర్, లలిత్ మోడీల ప్రమేయంపై వివరంగా పేర్కొంది.

రెండెజ్‌వౌస్ పంపిన లీగల్ నోటీసును పరిశీలించిన బీసీసీఐ.. కొచ్చి ఫ్రాంచైజీ జట్టు వ్యవహారంపై ఐపీఎల్ కౌన్సిల్‌తో రానున్న పదిరోజుల్లో సమావేశం కానుందని బీసీసీఐ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా మంగళవారం మీడియాతో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి