శశిథరూర్‌కు బెదిరింపులు: నోరు మెదపని మోడీ..!!

PTI
"మోడీకి క్షమాపణ చెప్పాలనీ, కొచ్చి ఫ్రాంచైజీ నుంచి వైదొలగాలనీ, లేకపోతే చంపేస్తామంటూ.." కేంద్ర విదేశాంగ సహాయమంత్రి శశి థరూర్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి బెదిరింపు ఎస్ఎమ్‌ఎస్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెదిరింపుల గురించి ఐపీఎల్ కమీషనర్ లలిత్ మోడీవద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. నో కామెంట్ ప్లీజ్ అంటూ తప్పుకున్నారు.

అలాగే శశి థరూర్ వ్యవహారంపై కూడా మాట్లాడేందుకు నిరాకరించిన మోడీ, ఇలాంటి అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయబోనని మీడియాకు స్పష్టం చేశారు. కాగా.. కొచ్చి ఫ్రాంచైజీ వివాదానికి సంబంధించిన అన్ని విషయాలపై భారత క్రికెట్ నియంత్రణా మండలికి వివరిస్తానని అన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటికే ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు ఆడుతున్నాయనీ, అందులో ఎవరెవరు వాటాదారులుగా ఉన్నారో అందరికీ తెలిసిందేననీ.. కొచ్చి ఫ్రాంచైజీ మాత్రం దీనికేమీ అతీతం కాదని మోడీ పేర్కొన్నారు.

కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారం తమ అంతర్గత విషయమనీ, దాన్ని త్వరలోనే పరిష్కరించుకుంటామనీ.. అయితే ఈ విషయంపై మీడియానే అనవసర రాద్ధాంతం చేస్తోందని మోడీ విమర్శించారు. ఐపీఎల్ ఛైర్మన్ అయిన తాను.. వివిధ ఫ్రాంచైజీల్లో వాటాదారులు ఎవరెవరు ఉన్నారో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందని అన్నారు. ఈ విషయంలో ఎవరి ప్రమేయం అవసరం లేదని.. ఐపీఎల్-3 సీజన్ ముగిసిన అనంతరం దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో విస్తృతంగా చర్చిస్తామని మోడీ వివరించారు.

ఇదిలా ఉంటే.. కొచ్చి ఫ్రాంచైజీలో భాగస్వామిగా ఉన్న సునంద పుష్కర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శశి థరూర్‌కు తాను ప్రతినిధిని కానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక మహిళగా తనకు ఆస్తులు సంపాదించుకునే హక్కులేదా అంటూ ప్రశ్నించిన ఆమె, ఈ వ్యవహారాన్ని మీడియా పెద్దదిగా చేసి చూపిస్తూ, తనను అవమానిస్తోందని ఆమె వాపోయారు. ఇప్పుడు మోడీ కూడా కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో మీడియానే తప్పుబడుతుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి