సీమింగ్ పిచ్‌తో ఇబ్బంది లేదు: కిర్‌స్టన్

వెల్లింగ్టన్‌లో భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగబోతున్న కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధం చేసిన సీమింగ్ పిచ్‌తో తమకెలాంటి ఇబ్బంది లేదని టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ స్పష్టం చేశారు. సీమ్‌కు సహకరించే బేసిన్ రిజర్వ్ ట్రాకుకు అలవాటు పడటంతో తమ ఆటగాళ్లకు ఆ పిచ్ పెద్ద సమస్య కాబోదని చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 3వతేదీ) ఆతిథ్య జట్టును సీమింగ్ పిచ్‌పై టీం ఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ మాట్లాడుతూ.. చలి గాలులతో కూడిన వాతావరణ పరిస్థితులు, సీమింగ్ ట్రాకు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిర్‌స్టన్ అన్నారు. 34 ఏళ్ల క్రితం వెల్లింగ్టన్‌లో భారత్ టెస్ట్ మ్యాచ్ గెలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేసిన కిర్‌స్టన్, ప్రస్తుత పర్యటనలో జట్టు మంచి క్రికెట్ వికెట్‌లకు బాగా అలవాటు పడిందన్నారు.

ఇక్కడి పిచ్‌పై బౌన్స్ బాగా లభించవచ్చునని, ప్రస్తుత పరిస్థితులలు ఎలా ఉన్నా, జట్టు ప్రదర్శనపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుందని కిర్‌స్టన్ వెల్లడించారు. రెండో టెస్టులో ఆతిథ్య జట్టు గట్టి పోటీని ప్రదర్శించిందని, చివరి టెస్ట్‌లో కివీస్ ఆటగాళ్లు పుంజుకోవచ్చునని కిర్‌స్టన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టీం ఇండియా ఆటగాళ్లు కూడా మైదానంలో రాణిస్తారని కోచ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి